పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0394-1 గుండక్రియ సంపుటం: 11-559

పల్లవి: నీవే మంచివాఁడ వయ్య నేనే వీరిడిఁ గాని
         భావించి నామంకు నేనే పాపఁగల నింకను

చ. 1: సారె సారె నిన్ను దూరి సణఁగులే యాడితిని
       భారపు నీసతులకుఁ బగ యైతిని
       యీరీతి నిన్నుఁ జేసి యేఁటిజన్మ మెత్తితినో
       తేరకొన నన్ను నేనే తిట్టుకొంటి నిందుకు

చ. 2: కపటాన నీమీఁద గబ్బిచూపు చూచితిని
       కపురుల నీమనసు గలఁచితిని
       యిపు డిందు కొడిగట్టి యెందుకు మంచిదాననో
       వుపమించి నాకు నాకే వుస్సు రంటి నేను

చ. 3: ఱట్టుగఁ నిన్నుఁ గూడి యుఱక యలయించితిని
       కట్టఁగడ నిన్నుఁ దిరుగ నీనైతిని
       యిట్టినన్ను శ్రీవెంకటేశ నేఁడు గూడితివి
       నట్టనడమ నిందుకే నవ్వుకొంటి నేనూ