పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0393-6 వరాళి సంపుటం: 11-558

పల్లవి: చేతికి లో నైనవారిఁ జెతురా పగవా రైన
         కాతరాన నీవే కళవళించితివి

చ. 1: యెట్టకేలకును నిన్ను యింటికిఁ బిలచుకొంటి
       చుట్టమ నయినదాన సూడు వట్టేనా
       యిట్టె నీ కెవ్వతె చెప్పే యింతసేతుఁ జేయ నని
       నెట్టన నాగుణ మెల్ల నీ వెరఁగవా

చ. 2: చెక్కు నొక్కి చేత మొక్కి సేవ లిన్నియునుఁ జేసె
        మొక్కలాన నింక నిన్ను మోస వుచ్చేనా
        యెక్కడిబుద్ది దలఁచి తేల సిగ్గు వడ నీకు
        యిక్కువ నీ వా సంది యిటువంటిదా

        మాఁగినమోమి యిచ్చి మంతానలు నీతో నాడి
        కాఁగిట నిన్నుఁ గూడి ఘాత సేసేనా
        యేఁగివచ్చి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
        నాఁగువారె వలపులు నమ్మి కియ్య వలెనా