పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0393-2 సాళంగం సంపుటం: 11-554

పల్లవి: చెలులతో నీసుద్దులు చెప్ప వచ్చునా
         చలము మన లోలోనె సాదించుట గాకా

చ. 1: మచ్చిక నీతిట్లూను మనలోని వొట్లూను
       చెచ్చెర నొరులతోడఁ జెప్ప వచ్చునా
       కొచ్చి బొమ్మల జంకించి కోపముల నుంకించి
       రొచ్చుల మతికాఁక దీరుచుకొంట గాకా

చ. 2: నీ చేఁతలను మన నెట్టుకొన్న మర్మములు
       చేచేత నొరులతోడఁ జెప్ప వచ్చునా
       తాచి నిట్టూర్పు నెరపి తగఁ గన్నులు గిరపి
       యేచి మనలో మనమే యిందుకొంట గాకా

చ. 3: యింతేసి నీ వినయాలు యిక్కువ మనరతులు
        చెంతల నొకరితోడఁ జెప్ప వచ్చునా
        పంతపు శ్రీవెంకటేశ భావములనే చొక్కి
        వింత సంతసాల విఱ్ఱవీఁగుకొంట గాకా