పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0392-6 శుద్ధవసంతం సంపుటం: 11-552

పల్లవి: ఇసుమంత పనికిఁ గా నెంత సేసేవు
         విసు పేల వచ్చె నీకు వినవయ్య మాఁటా

చ. 1: తూఁగుమంచ మెక్కుకొని తొయ్యలి లేవ దంటా
       తోఁగి చూచి నీవు వోఁగా దొడికి పట్టి
       వేఁ గగు కుచభారము వీడఁగాఁ బెనఁగీ నాపె
       వీఁగక మన్నించి నేఁడు వినవయ్య మాఁటా

చ. 2: తామెర నాపె వేయఁగఁ దాఁకి నీకు నొచ్చె నంటా
       వోమి నీవు కళ వట్టి వూర కుండఁగా
       మోము చిన్నఁబోయి యింతి మోవితేనె నీకు నిచ్చి
       వేమారు వేఁడుకొనీని వినవయ్య మాఁటా

చ. 3: సిగ్గుతో నున్నది యంటా శ్రీవెంకటేశుఁడ నీవు
       బగ్గన నవ్వలిమో మై పవ్వళించఁగా
       దగ్గరి యందుకే యింతి తమకించి నిన్నుఁ గూడె
       వెగ్గళించ కిపు డిట్టె వినవయ్య మాఁటా