పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0391-1 ముఖారి సంపుటం: 11-541

పల్లవి: చెప్పకు నీ వోరపులు సిగ్గు లయ్యీని
         కప్పుక రాఁగానె కాక కడుఁ బెలుచవు

చ. 1: ఆయము దప్పక నిన్ను ఆడ కుండఁగానె కాక
       వోయయ్య నీ వింతేసి కోరిచేవా
       చాయ సేసుకొని నీతో సరి నవ్వే దెరఁగవు
       నీయంతనే వచ్చి నిజము నెరుపేవు

చ. 2: సంగడి దప్పి నీపైఁ జేయి చాఁచ కుండఁగానె కాక
       యింగితాన నెందు కైన నియ్యకొనేవా
       చెంగట నీగుణములు చెల్లఁ బెట్టే దెరఁగవు
       ముంగిటిచెలుల కెల్ల ముచ్చట చేప్పేవూ

చ. 3: కిమ్ముల బొమ్మలకు జంకించ కుండఁగానె కాక
       నెమ్మది నీ దీమసాలు నెరుపేవా
       యిమ్ముల శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
       సమ్మతించి యిప్పుడు గా చనువు లిచ్చేవూ