పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0390-3 దేసాళం సంపుటం: 11-537

పల్లవి: వట్టి మండాటము లేల వద్దన నేలా
         యిట్టె నీపతి వీడె యే మైన ననవే

చ. 1: వలవనిజోతి యాల వాదుటాల మా కేల
       తలఁచఁగానె యాతఁడు తానే వచ్చెను
       పొలసి యిందాఁక నేము పూనుక వచ్చితి మింతే
       చెలువుఁడు వాఁడె నీవు సేసినట్టు నేయవే

చ. 2: ఆన వెట్ట నా కేల అంతేసి పంతము లేల
       వీనుల నాతఁడు దానే వినుచున్నాఁడు
       కానీవే ఆతఁడు నీవు గన్నదాఁకా గురియైతి
       పోనీక యీతని కిన్ని బుద్దలూనుఁ జెప్పవే

చ. 3: చక్కటి సేయఁగ నేల చవులు చెప్పఁగ నేల
       గక్కన నాతఁడును నిన్నుఁ గాఁగిలించెను
       యిక్కువ శ్రీవెంకటేశుఁ డెనసి వున్నాఁడు నీతో
       యిక్కడు నాతనితో నీ వెట్టయినఁ బెనఁగవే