పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0388-4 సామంతం సంపుటం: 11-526

పల్లవి: ఎంత నీవు పతి వైనా యింతులకు లోనే సుమ్మీ
         వంత జవ్వనమదపువారు సుమ్మీ వీరు

చ. 1: సొలసి యాడెటిమాట సుమాళముమీఁది పాట
       పెలుచుఁగామినులకుఁ బెట్టని కోటా
       బలిమి చూపఁగ రాదు పంతపు మగవారికి
       వలరాచసలిగెలవారు సుమ్మీ వీరు

చ. 2: కనుచూపుల కొసరు గబ్బితనపుటుసురు
       దినవలపులకు నెత్తినయసరు
       మొనలు మీరఁగ రాదు ముంచి యెంతకొర తైన
       వనవసంతునిపౌజువారు సుమ్మీ వీరు

చ. 3: వుదుటుమీఁది సణఁగు వొద్దికతోడి గొణఁగు
       మదరాగ మీసతికి మంచి మణుఁగు
       ఆదన శ్రీవెంకటేశ అట్టె కూడితి వీపెను
       వదనశశినిఁ బోలేవారు సుమ్మీ వీరు