పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-2 శంకారాభరణం సంపుటం: 11-512

పల్లవి: మేలే నీభాగ్య మలమేలుమంగా అదె
         ఆలరి నీపతి మెచ్చె నలమేలుమంగా

చ. 1: యెంచ రాక పతితోడ నిచ్చకము లాడి నేర్పు
       మించితివి గదే యలమేలుమంగా
       వంచనఁ బ్రియాలు సేసి వడి నాతనిచిత్తము
       అంచెల దక్కఁ గొంటివే అలమేలుమంగా

చ. 2: తఱితోడ మంచిజాణతనపుమాటల నెల్ల
       మెఱసితి గదే యలమేలుమంగా
       తెఱఁగుల నీపతికి తెల్లనినవ్వులు చల్లి
       అఱచేతిమణి వైతి వలమేలుమంగా

చ. 3: వొక్కటై శ్రీవేంకటేశవుర మెక్కి యేపొద్దు
       మిక్కుట మైతివే యలమేలుమంగా
       యెక్కువఁ బదారుమేలుయింతుల మతనికి మ
       మ్మక్కర దీర మన్నించి తలమేలుమంగా