పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-1 దేవగాంధారి సంపుటం: 11-511

పల్లవి: మట్టు మీరినచేతల మగవాడవు
         వట్టి సత్తేలు నెరప వలెనా నీవు

చ. 1: అంగన నీవును మాట లాడుతా నుండగ జూచి
       అంగవించి పొందు గద్దొ యని వుంటిమి
       నింగి మోవ నాన లెల్ల నీ వేల పెట్టుకొనేవు
       చెంగట దోసమా నీకు జెల్లదా యేమి

చ. 2: పొలతి నీ వొకవీధిఁ బొలసి నడవఁ గాను
       అలరిన నీసమ్మంధ మని వుంటిమి
       తెలపు మనుచు నేల తీసేవు నాకోంగు వట్టి
       తలఁచ నాపెకు నీకుఁ దగదా యేమి

చ. 3: యింతియును నీవును నేకతాన నుండఁ జూచి
       అంతలో నీవు గూడితి వని యుంటిమి
       వంతకు శ్రీవెంకటేశ వడి నలమేలుమంగ
       నింతటఁ గూడితివి నీ వెరఁగవా యేమి