పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0385-5 పాడి సంపుటం: 11-509

పల్లవి: ఇందుకు బాస యిచ్చెద యిటు నీయింటికి రాను
         చెంది నీసతులు యింత చేసిరి నీగుణము

చ. 1: నవ్వుతా దగ్గరి వచ్చినాను సరకు గొనవు
       యెవ్వరితో మాట లాడే విపుడు నీవు
       మువ్వంక నీరాజాసము మున్నిటివంటిదా నేఁడు
       రివ్వలుగా సతు లెల్ల రేఁచిరి నీగుణము

చ. 2: బడి బడి మొక్కినాను పరా కై వున్నాఁడవు
       కడు దొర వైతి నీకుఁ గాన వచ్చీనా
       కడఁగి మావంటివారిఁ గైకొనేవా గొల్లెతలు
       బెడసుగొల్ల మంకుతోఁ బెంచిరి నీగుణము

చ. 3: యిట్టె చేయి వట్టినాను యించు కంతాఁ దెమలవు
       నెట్టుకొన నీబిగువు నేఁడు గొత్తలా
       నెట్టన శ్రీవెంకటేశ నే నల మేలుమంగను
       జట్టిగొని కూడితివి సాజమే నీగుణము