పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0385-2 హిందోళవసంతం సంపుటం: 11-506

పల్లవి: వట్టిమాట లిఁక నేల వాసి గలకాంతలకు
         గుట్టుతోడ నుండేదె గుణ మింతే కాక

చ. 1: పూసుక వాసుక వచ్చి పొందులు నీతోఁ జెప్పి
       వేసరించేకాఁగిటిలో వేడు కున్నదా
       మూసినతముత్యమువలె మూల నుండఁగా నీవే
       చేసినపాటి ప్రియము చేకొనేది గాక

చ. 2: చేరి నవ్వి విన్నపాలు చెలుటచేఁ జేయించి
       సారెఁ జల్లేకూరిమిలో చవు లున్నవా
       వూరక మానావతి నై వోజ దప్ప కుండఁగా నీ
       వేరీతి చేసిన నది యియ్యకొంట గాక

చ. 3: యిచ్చకాలు సేసుకొంటా యెరవువలపు చల్లి
       తచ్చి యెంత పిలిచినా తమి వుట్టీనా
       అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
       యిచ్చట నీవే కూడితి విది మేలు గాకా