పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0384-5 ముఖారి సంపుటం: 11-503

పల్లవి: పో పోయి దేడ సుద్ది పొద్దు పొద్దు చెలులకు
         యేపున నిన్ను రమ్మన నేడదాన నేను

చ. 1: కాతరాన నలుకలు గడించేవు గాక నీవు
      నీతో నలుక రేఁచ నే మెవ్వరము
      జాతులకు నీ వాడెటిచారువాకా లింతే కాక
      ఆతల నిన్నుఁ గొసర నంత పొందులా

చ. 2: చిన్నఁ బో యుందాన నంటా చెక్కు నొక్కే వింతే కాక
       వున్నతి నీముందరను వొచ్చెము గాదా
       యిన్నేసి నీ వినయాలు యెగసక్కే లింతే కాక
       నన్ను నీవు వేఁడుకోను నంటుదాననా

చ. 3: అక్కడ పూర కుందువా ఆనలు వెట్టేవు గాక
       యిక్కడ వా దడువ మా కెవ్వ రున్నారు
       గక్కన శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
       యెక్కువ తక్కువ లిఁక నేల మాకూ