పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0384-2 సామంతం సంపుటం: 11-500

పల్లవి: మన మింత దడ వాయ మంకు వాప లే మైతిమి
         ఘనుఁడు గాన యాతఁడు కాంతకాఁక వాపెను

చ. 1: చెలియమోము చూచి చెక్కులు చేత నొక్కి
       కలవురేకులకొప్పు కడు దువ్వి
       సెలవుల నవ్వించి చేరి మోవితేనె లాని
       అలుక దేరిచెఁ బతి అదివో యిప్పుడు

చ. 2: మాటలనె బుజ్జగించి మనసునొప్పులు మాన్పి
       కాటుకన్నులయింతి కందువ లంటి
       తేటలఁ గతలు చెప్పి దిష్టపుమన్నన లిచ్చి
       యీటునఁ గోపము దీర్చె నిదివో విభుఁడు

చ. 3: వనితఁ గాఁగిట నించి వాడినదప్పి దేరిచి
       ననుపులు నటియించి నయ మిచ్చి
       తనువు నిమిరి యీపె తత్తరాలు మందిలించె
       యెనసి శ్రీవెంకటేశుఁ డిదివో యిపుడు