పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0383-6 పాడి సంపుటం: 11-498

పల్లవి: నేనే పిలువ ననే నేర మేమి గలిగినా
         దీన నైనతప్పు మీఁద దిద్దుకొనేఁ గాని

చ. 1: వలపు బలిమి సేసి వంతకుఁ బెనఁగఁ బోతే
       చలువలే వేఁ డౌను సతులాల
       వెల నున్నరమణుని వేడుక నేఁ బిలిచితే
       చులుకఁదనము రాదా చూడఁ గానె యిపుడూ

చ. 2: మనసు రానిచోట మాటలఁ గొసరఁ బోతే
       చన వెల్లాఁ జవి దప్పు జాణలాల
       ననుపు లేనిపతితో నవ్వులు నవ్వఁగఁ బేతే
       పని మాలినది గాదా పై పైనె యిపుడూ

చ. 3: దరదరిఁ గాక నే దగ్గరి కూడఁగఁ బోతే
       సరసమే విరస మౌ సకియలాల
       యిర వై శ్రీవెంకటేశుఁ డిట్టె విచ్చేసి కూడె
       దొరతన మిది గాదా తుద కెక్కె నిపుడూ