పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0383-3 దేసాళం సంపుటం: 11-495

పల్లవి: ఏల నాపై నాన వెట్టే వేఁటికి నీకు వెరపు
         నీలాగు రమణుఁడనే నెఱఁగనా

చ. 1: తేరకొన నీగుణాలు దెలిసినప్పుడు గాక
       వీరి వారి మాటలకె వేగిరించేనా
       మేరతో నీవు నాయెడ మెచ్చుగా నడవఁ గానె
       కూరిమి గొసరి నిన్నుఁ గోపగించేనా

చ. 2: యెల్లవారు నీచేఁతలు యెఱుఁగుదు మన్నదాఁకా
       అల్లంత నిన్నుఁ గంటానె అలిగేనా
       కల్ల నిజ మెఱఁగక కాదు గూడ దని నీపై
       వెల్లవిరిగా నిందలు వేయఁ బొయ్యేనా

చ. 3: మంతానాన నీ మేన మచ్చము గానకతొల్లె
       పంత మాడి నే నీతో పగ చాటేనా
       యింతలోఁ గాఁగిలించితి విందుకె శ్రీవెంకటేశ
       యెం తయిన నిన్ను నే నెడసి వుండేనా