పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0382-2 శుద్దదేశి సంపుటం: 11-488

పల్లవి: వీరి వారివలె నేను వింతదాననా
         నేరక నీ వుండినాను నే మెచ్చక మానను

చ. 1: వలచిన మేలు నీవు వలవ కున్నా మేలు
       తలఁపు నీమీఁద నాకుఁ దగిలి పోదు
       అలిమి పట్టఁగ వద్దు ఆనలు వెట్టఁగ వద్దు
       చెలిమి నీతో నెవుడుఁ జేయక నే మానను

చ. 2: యింటికి వచ్చిన మేలు యేడ నున్నా మేలు నీ
       వెంట వెంటఁ దిరిగి సేవించక పోను
       తొంటిపొందు చెప్ప వద్దు దొమ్మిఁ జెక్కు నొక్క వద్దు
       అంటి ముట్టి సరసము లాడక నే మాననూ

చ. 3: యివ్వలమో మైన మేలు యెటువలె నున్న మేలు
        నెవ్వగ దీరఁ గూడక నే మానను
        రవ్వగ శ్రీవెంకటేశ రతిఁ జొక్కించితి విదె
        పువ్వువలె నిన్ను నేఁ బొదుగక మానను