పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-5 కొండమలహరి సంపుటం: 11-485

పల్లవి: నీ కేమి దూరుదాన నే నైఁతి గాక
         వాకున నప్పుడే నీతో వద్దననా

చ. 1: నా మోము చూచి నీవే నవ్వఁగా నవ్వితిఁ గాక
       ఆమాట లెల్లా నాపెతో నాడుదురా
       ప్రేమాన నా పంపఁగా నే పిలువ వచ్చితి నింతే
       చే ముట్టిన యాసుద్ది చెప్పుదురా

చ. 2: రమ్మని చేయి వట్టఁగ రతి నూర కుంటిఁగాక
        యెమ్మె కెల్లా నాపెతోడ నెంచుకొందురా
        వుమ్మడి నాపెకు నీకు నూడిగపుదాన నింతే
        అమ్మరో నావుంగరము ఆపె కిత్తురా

చ. 3: పాదాలు గుద్దు మనఁగా పైకొన గుద్దితిఁ గాక
       పోదిగా నాసుద్ది యీడఁ బొగడుదురా
       యీదెస నాపెఁ గూడితి విట్టె శ్రీవెంకటేశ
       సోదించి నా మో వాపెకుఁ జూప వచ్చునా