పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-4 సామంతం సంపుటం: 11-484

పల్లవి: ఎప్పుడు నీయిచ్చలోని యింతిఁ గాక
         తప్పులు నీమీఁద వేసేతరుణినా నేను

చ. 1: వంతులకు వాసులకు వలపులు చల్లి చల్లి
       అంత నిన్ను దూరేటియాఁటదాననా
       కొంత నిన్నుఁ గోపగించి గొణఁగి గొణఁగి తిట్టి
       పంతము వెనక నిచ్చే పడఁతినా నేను

చ. 2: పొద్దు వొద్దు నీవద్ది పొలఁతులవలెనే
       అద్దలించి పెనఁగేటి యాఁటదాననా
       ఉద్దండాలు నీతోఁ జేసి పూరకే వెనకు వచ్చి
       తిద్దుకొని మాట లాడేదేవులనా నేను

చ. 3: గారవాన నిన్నుఁ గూడి కాఁగిటి నీచేఁత లెల్ల
       ఆరయ జెప్పుకొనేటి యాఁటదాననా
       నేరుతువు శ్రీవెంకటనిలయ నీయాల నైతి
       సారెకు సారె మాటాడేసకియనా నేనూ