పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-5 దేసాక్షి సంపుటం: 11-479

పల్లవి: మామాట లేల వినేవే మగువ నీవు
         వోమి యాతనికే మొక మోడేవు గాని

చ. 1: పంతాన రా నని చలపట్టుకొని వుండఁ గాను
       యెంతదడ వైనఁ బోర నేలే మాకు
       చెంతల నాతఁడే వచ్చి చేయి వట్టి తియ్యఁ గాను
       వంతకు నేఁడు నీ విట్టే వచ్చేవు గాని

చ. 2: మాట లాడ నని నీవు మౌనముతో నుండఁ గాను
       యేఁటికిఁ బెనఁగితియే యిందాఁకా నేము
       పాటించి యాతఁడే వచ్చి పక్కన నవ్వితేను
       గాఁటపుమచ్చట లాడి కరఁగేవు గాని

చ. 3: మంచముపైఁ బవ్వళించి మంతనాన నుండఁ గాను
       పొంచి నిన్ను లేప నేలే పొదిగి నేఁడు
       అంచెల శ్రీవెంకటేశుఁడదె వచ్చి నిన్నుఁ గూడె
       యెంచి యాతనికే చన విత్తువు గాని