పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-4 నాదరామక్రియ సంపుటం: 11-478

పల్లవి: వద్ద నుండి మీరు చూడ వలసి కాక
         కొద్దిమీరి నేనె పైకొన కుండేనా

చ. 1: కగ్గి తనచేఁతలకు కన్నుల మొక్కినదాన
       దగ్గరి తనకు మొక్కఁ దడవా నాకు
       యెగ్గు లెంచక పనులు యే మైనాఁ జేసినదాన
       వొగ్గి వూడిగాలు సేయ కూర కుండేనా

చ. 2: బింకాన నాఁడిట్టె తన్ను పేరఁ బిలిచినదాన
       అంకెల తనతో మాట లాడ కుండేనా
       కంకి తనసుద్దులకు గక్కన నవ్వినదాన
       యింకా సరస మాడ కిటు మానేనా

చ. 3: చెమటమేని తనకు చేలా గిచ్చినదాన
       అమరఁ గాఁగిఁట గూడ నరుదా నాకు
       సముఖుఁ డై శ్రీవెంకటేశుఁడు దానె ననుఁ బొందె
       తమకాన నిద్దరికి తతి పోయినా