పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-3 పాడి సంపుటం: 11-477

పల్లవి: సతులకుఁ బతులకు సాజమె యిది
         యితవు లెంచుక తామే యేకములు నవుదురు

చ. 1: కూరిమి గలుగుసతి కోరి పతిఁ గాన కున్న
       యేరీతి నయిన దూరు యిందరితోడ
       దార దప్పి మగవాఁడు తనయిచ్చఁ దిరిగాడి
       యీరసాన నే మనిన యెగ్గులునుఁ బట్టఁడు

చ. 2: అంకెకు రా కున్నవేళ నాఁడువారు మగవానిఁ
       గంకి నేసి కన్నచోటఁ గాకు సేతురు
       వంక లొత్తఁ బోఁడు తనవల్ల నేరుమి గలితే
       మంకు దీరి తనుఁ దానె మట్టుకు వచ్చును

చ. 3: కాఁగినచెలియ తనకాఁగిటికి దగ్గరితే
       లోఁగి తనవిభునికి లో నవును
       వీఁగుచు శ్రీవెంకటేశ వెలఁదిఁ గూడితి విట్టె
       చేఁగ దేర నే మిందుకు నెలవి నవ్వుదుమూ