పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-1 వరాళి సంపుటం: 11-475

పల్లవి: ఆడ కేల పిలిచేవే అప్పటి నన్ను
         గోడ గడుఁగఁగ నేల గొబ్బున రాఁ గదవే

చ. 1: లోఁతఁకు జొచ్చినవాఁడు లోన నీమాట వినీనా
       మూఁతి మీఁది కెత్తేవాఁడు మోము చూచీనా
       చేఁతలు దవ్వెటివాఁడు సిగ్గు వడ నేరుచునా
       పాఁతుమా కై వుండేవాఁడు పైకొనీనా

చ. 2: పెచ్చు వెరిగెటివాఁడు ప్రియము చేకొనునా
       మచ్చరమే పెంచేవాఁడు మన సిచ్చీనా
       వొచ్చెము వెదకేవాఁడు వొగి నిజ మెరుఁగునా
       యెచ్చు కుందు చేఁతవాఁడు యిత వై చూచీనా

చ. 3: సటల మాటలవాఁడు సరవిగా నడచీనా
       కుటిలపుగతివాఁడు గుట్టు చెప్పీనా
       యిటు శ్రీవెంకటేశుఁడు యీమాటకే నన్నుఁ గూడె
       యిటువలె నుండినామ యింకఁ బాసీనా