పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0379-2 శుద్దవసంతం సంపుటం: 11-470

పల్లవి: అప్పటి నేనే కోపి నందురు మీరు
         చెప్పరాని ఆతనిచేఁత లివి చూడరే

చ. 1: నవ్వుతానె మంచితనము నెరుపుత గాక
       యెవ్వరిమనసు లెట్టో యెరుఁగుదునా
       పువ్వుల నే వేయఁగాను పూఁచి నిమ్మపంట వేసీ
       దవ్వుల నుండి యాతని తగవులు చూడరే

చ. 2: మొగము చూచి తనకు మొక్కఁ గలదానఁ గాక
       యెగసక్కెము లవుట యెరుఁగుదునా
       తగు వెన్నెలలోనికె తన్ను నేఁ బిలువఁ గాను
       సగము చీఁకటిలోనె సన్న సేసెఁ జూడరే

చ. 3: చెంది యిట్టె తనసేవ సేయఁ గలదానఁ గాక
       యిందుకె నన్ను మెచ్చుట యెరుఁగుదునా
       అందపు శ్రీవెంకటేశుఁ డన్నిటా నన్నుఁ గలసె
       కందువలు గరఁగించి కడు మీరిఁ జూడరే