పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-1 దేసాళం సంపుటం: 11-463

పల్లవి: అన్ని సుద్దులు నెరుఁగు నాతఁడె కాక
         యెన్నికలు పలుమారు యే మెంచేనే నేను

చ. 1: నివ్వెరగు వడి యుండి నే నే మనే నిన్ను
       నవ్వలిమాటలు నన్ను నడుగ నేలా
       దవ్వులఁ దనచేఁతుల తలపోయుచున్నదాన
       యెవ్వరిమాటల కని యే మందు నేను

చ. 2: చెక్కుచేత నే నుండి నేనే దేమే నిన్ను
       తక్కక నన్నేల మీరు తడవేరే
       మొక్కలోన నాతనిమోము చూచె నిదే నేను
       యెక్కువ తక్కువలకు నెంతదాన నేనూ

చ. 3: కలకల నవ్వుతాను కా దనే దేమే నిన్ను
       చలపట్టి వల పేల చల్లు మనేరే
       యెలమి శ్రీవెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
       యిల నాకు నెదు రేదే యిర వయితి నేనూ