పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-4 భైరవి సంపుటం: 11-460

పల్లవి: ఇట్టె నేఁ దప్పక చూడ నెంతదానము
         పట్టి నీతోఁ బంత మాడి పని గొందువా

చ. 1: పాటించి యిచ్చినమాఁటపట్టుకే నిన్నంటిఁ గాక
       యీటున నీతోఁ బెనఁగ నెంతదానము
       వాఁట మైన వలపులే వాసి రేఁచెఁ గాక నన్ను
       వేఁట వెట్టి నిన్ను నింత వేసరింతునా

చ. 2: కదిసి చెప్పేకతకుఁ గాళ్లడిగితిఁ గాక
       యెదురుమాటాడ నీతో నెందదానను
       మొదల నా మొగమోటె మొక్కించెఁ గాక నీకు
       యిదివో నిన్నుఁ దగిలి యింత సేతునా

చ. 3: సందడిఁ గాఁగిలించఁగా సంతోషించితిఁ గాక
       యిందరిలో నిన్ను నవ్వు నెంతదాననూ
       అంది శ్రీవెంకటేశుఁడ అట్టె నన్నుఁ గూడితివి
       పొందుకు మెచ్చే కాక పోనీ కిట్టె వుందునా