పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-6 సాళంగం సంపుటం: 11-456

పల్లవి: దోసము దోసము దొర నే మనినా
         యీసు లేనివిభుఁ డిచ్చకుఁ డతఁడూ

చ. 1: పంతము లాడకు పగతోఁ జూడకు
       కాంతుఁడు నిను నిదె కైకొనును
       యెంత వడియు నీ వెరఁగక తిట్టిన
       వంతుకు మొక్కవె వైపరి యతఁడూ

చ. 2: కోపము మానుము గుంపెన లుడుగుము
       తీపుల నీపైఁ దెగఁ డతఁడు
       చే పట్టఁగ గోరఁ జిమ్మినయందుకు
       మోపుచు శిరసున మొక్కవె యిపుడు

చ. 3: చలము లేమిటికి జంకెన తగ దిఁక
       బలిమి శ్రీవెంకటపతి గూడె
       తొలుత నీ వతనిఁ దోసి పెనఁగితివి
       అలరుచు మొక్కవె అన్నియుఁ దేరె