పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-4 ముఖారి సంపుటం: 11-454

పల్లవి: ఇంక నేల తెగి కొంక నెదురా నేనూ నీవు
         కంకిగా నేమి సేసినాఁ గా దనేనా నేను

చ. 1: మక్కువ నీవే నన్ను మన్నించఁగా నింతే కాక
       యెక్కడ నీసతులలో నెవ్వతె నేను
       మొక్కలపుఁజేఁత లేల మొగమాట మరి యేల
       వక్కణించి నీ వే మన్న వద్దనేనా నేను

చ. 2: నీ విచ్చినచనువున నేనే కసరితిఁ గాక
       యీవల నీ వూడిగాన కేబాఁతి నేను
       ఆవలఁ గపట మేల అట్టె కూటము లేల
       నీవలసిన ట్టుండఁగా నిందించేనా నేను

చ. 3: కామించి నీవే నన్నుఁ గలయఁగా నింతే కాక
       యేమంచిదాన నీకు యిప్పుడే నేను
       ఆముక శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
       ప్రేమము నీవు నించఁగా బిగిసేనా నేనూ