పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-3 సామంతం సంపుటం: 11-453

పల్లవి: ఎఱఁగ ననకుండా నీ కెఱిఁగించితిమి నేఁడు
         తఱవాతిపనులకు తలఁపు నీ కెట్టిదో

చ. 1: జక్కవకుచములపై జారెటి పయ్యదతోడ
       చెక్కుల జారే చెమటచిత్తడితోడ
       నిక్కి నిక్కి లోలోనె నీ కెదురు చూచుకొంటా
       అక్కడ నున్నది చెలి ఆనతి నీ దెట్టిదో

చ. 2: నిట్టూరుపుగములతో నివ్వెరగుపాటుతోడ
       అట్టె నిన్నుఁ గూడెటి యాసలతోడ
       నెట్టనఁ దనపాయము నీకే మీఁ దెత్తుకొంటా
       యిట్టె వాకిటికి వచ్చె యెన్నికె నీ కెట్టిదో

చ. 3: బారపుఁదురుముతోడఁ బవళించే నీపానుపు
       చేరి యం దున్నది నవ్వునెలవితోడ
       ఆరయ శ్రీవెంకటేశ అంతలో నేతెంచి యాపె
       నూరడించి కూడితివి వున్న దిఁక నెట్టిదో