పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-2 సాళంగనాట సంపుటం: 11-452

పల్లవి: ఇంత యెరఁగనియట్టి యెడ్డనా నేను
         కాంతుఁడ నీ వంతేసి గరిసించ నేఁటికి

చ. 1: సిగ్గు వడి వొకమాఁట చింతతోడ నొకమాఁట
       వెగ్గళించి నిన్ను నాడ వెఱ్ఱిదాననా
       అగ్గలపుమోహ మైతే అన్నియు నమరుఁ గాక
       దగ్గరి నప్పుడె నీతోఁ దమకించఁ దగునా

చ. 2: కన్నప్పుడే మొక్కులూను కాన కున్నఁ దక్కులును
       పన్ని యింత నేయ నీకుఁ బగదానవా
       మన్నించినవారితోడ మందెమేళ మింపు గాక
       నిన్న నేటిలోనకే నిన్ను దూరఁ జెల్లునా

చ. 3: మూల నుండి వొకవాని ముంగిట నొకవావియు
        గోల నై చెప్పుక రాను కూళదాననా
        యీలాగుల శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
        వేళగా కిందాఁక నిన్ను వేసరించ వచ్చునా