పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-1 శంకరాభరణం సంపుటం: 11-445

పల్లవి: ఏల నన్ను బుజ్జగించే వింతటిలోనె
         నాలితో నీ వేడ నున్నా నన్ను మానేవా

చ. 1: చిన్నఁబోయి వుండ నేల చెక్కు చేయి నాకేల
       మన్నించి నీవే నాతో మాట లాడఁగా
       మున్నె నీ కొప్పగించితి ముంచిన నా దేహ మెల్ల
       నిన్న నేఁటి వారిమాట నే వినేనా

చ. 2: వెంగె మాడ నా కేల వేసరుకొనఁగ నేల
       సంగతిగా నీవే నాతో సారె నవ్వఁగా
       వుంగరము వెట్టితిని వున్నదాన నీకుఁ గాను
       చెంగట నెవ్వరు నేమి చెప్పేరు యిఁకను

చ. 3: సిగ్గు వడ నా కేల సిరసు వంచఁగ నేల
       దగ్గరి నీవె నాకు దక్కి వుండఁగా
       నిగ్గుల శ్రీవెంకటేశ నీవే నన్ను గూడితివి
       యెగ్గులు దప్పలు మరి యెంచ నేది యిందునూ