పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-6 పాడి. సంపుటం: 11-444

పల్లవి: ఏలోయి విభుఁడా యిప్పుడు బాఁ తైతిమా
         తాలిమి నిన్నాళ్లు నీతలఁ పిట్టె వుండేనా

చ. 1: సంగతిగా నాపెతోడ జగడించి రా కుండితే
       నంగవించి మాతో మాట లాడుదువా
       కుంగక కూడు వేఁ డైతే కూరాకు నంజినట్టు
       పొంగుచు నీ నా సంది పొందు లెల్ల నిదివొ

చ. 2: సన్నల నాపెతో యకసక్యేలకు నేమో కాక
       యెన్నఁడైనా మాయింటికి నిట్టే వత్తువా
       పన్నీరు గడుఁ జలైతే పచ్చిచాఁదు పూసినట్టు
       యెన్నఁగ నీ నా పొందు లిన్నియు నిట్టెపో

చ. 3: బలిమి నీ వాపెతోడ పంత మాడి రా కుండితే
       కొలఁది మీర నన్నిట్టే కూడుదువా
       అలరి శ్రీవెంకటేశ ఆయములు సోఁకినట్టు
       తలఁగని నీ నా పొందు తారుకాణ సుమ్మీ