పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0373-5 గుండక్రియ సంపుటం: 11-437

పల్లవి: త నంతఁ దా నెఱఁగఁడు తగులక నాకుఁ బోదు
         చెనకఁగ నైన దయ్యీ సిగ్గులు వడకురే

చ. 1: యేమా టయినఁ గాని యెగ్గు దప్పు లైనఁ గాని
       ఆమాఁటే నామాటగా ననరే మీరు
       వేమారుఁ దనతోడ వేసరితి మిన్నిటాను
       వోముచు నెన్నాళ్ల దాఁకా వోరుచుక వుందునే

చ. 2: వాసి వంతు లైనాఁ గాని వైపు లెట్టయినాఁ గాని
       సేసినదే నాచేఁత చెల్లెనే మీకు
       మోసపోతి నిన్నాళ్లు మొగమోటములనే
       పాసితే వలపులు చేపట్ట నెట్టు వచ్చునే

చ. 3: చేతికి లో నైనాఁ గాని సేసినట్టే సేయనీ
       మీతగవే నాతగవు మీరరే మీరు
       యీతల శ్రీవెంకటేశుడింతలో విచ్చేసి కూడె
       యీతలఁపు నేఁడు గాక యిన్నాళ్లు నెందుండునే