పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-4 శంకరాభరణం సంపుటం: 11-424

పల్లవి: ఎఱఁగమా యింత యెమ్మెకాఁడ
         గుఱి లేని వట్టి కోపకాఁడా

చ. 1: మాయలు నెరపి మంచిమాఁట లాడి
       చాయకు వలచే సటకాఁడా
       కాయజకేలికి కాలిసన్నగోర
       వాయక వాసేపు వగకాఁడా

చ. 2: అట్టు నిట్టు వచ్చి యాసలు రేఁచేవు
       పట్టినచలముల పంతగాఁడా
       గుట్టు సేసుకొని కూరిమి చల్లేవు
       తొట్టినపాయపు దొమ్మికాఁడా

చ. 3: మన్నించి యింతలో మంచ మెక్కితివి
       మిన్నక నవ్వుల మేఁటికాఁడా
       యిన్నిటా శ్రీవెంకటేశ కూడితిని
       కన్నుల మొక్కెటి గండికాఁడా