పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-2 లలిత సంపుటం: 11-416

పల్లవి: కా దని మీమాఁట కడచేమా
         సోదించి మమ్మే సొలయఁగ రాదా

చ. 1: తెలిసినమాఁటకు తెరమరఁ గేఁటికి
       చెలులు తగవు లిటు చెప్పరే
       అలిగి యిద్దరము నటు నిటు నుండఁగ
       చల మే లని మమ్ము జంకించ రాదా

చ. 2: మునుపు వెన కెరిఁగి మొగమో టేఁటికి
       అనవలసినట్ల నాడరే
       పెనఁగుచు మాతో బీరము లాడఁగ
       కనుసన్నలచే కలఁపఁగ దగదా

చ. 3: అమరినపనులకు ననుమాన మేల
       సమము సేసితిరి సరుగ మమ్ము
       క్రమమున శ్రీవెంకటపతి గూడెను
       గుము రై మా కిటు గురిగాఁ దగదా