పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-1 సాళంగం సంపుటం: 11-415

పల్లవి: ఎదుట నున్నాఁడు వీఁడె యీబాలుఁడు
         మదిఁ దెలయ మమ్మ యేమరులో కాని

చ. 1: పరమపురుషుఁ డట పసులఁ గాచె నట
       సరవు లెంచిన విన సంగతా యిది
       హరియే తా నటముద్దు లందరికిఁ జేసె నట
       యిర వాయ నమ్మ సుద్దు లేఁటివో కాని

చ. 2: వేదాల కొడయఁ డట వెన్నలు దొంగిలె నట
       నాదించి విన్నవారికి నమ్మికా యిది
       ఆదిమూల మితఁ డటా ఆడికెల చాఁత లట
       కా దమ్మ యీసుద్దు లెట్టికతలో కాని

చ. 3: అల బ్రహ్మతండ్రి యట యశోదకు బిడ్డఁడట
        కొలఁ దొకరికిఁ జెప్ప గూడునా యిది
        తెలిపి శ్రీవెంకటాద్రిదేవుఁడై నిలిచె నట
        కల దమ్మ తన కెంత కరుణో కాని