పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-6 ముఖారి సంపుటం: 11-408

పల్లవి: ఇట్టివలపులు తల కెక్కెఁ గా నీకు
         పెట్టరానిమందు లెల్లఁ బెట్టెఁ గా నీకు

చ. 1: కోపగించి కన్నులనె కొసరుచు దిట్టఁగాను
       ఆపెతోడిమాట లిత వాయఁగా నీకు
       పో పో కొంగు వీడు మని పోరఁగానె యాపెతోడ
       పూపనవ్వు నవ్వ బుద్ది వుట్టెఁ గా నీకు

చ. 2: పిలువఁ బిలువఁ గానె బిగిసేయాపెతోడ
       బలిమిఁ బట్టి పెనఁగ బాఁతిగా నీకు
       తల మొల వీడఁగాను తప్పించుకొనేయాపెకు
       యెలమిఁ దమ్మ వెట్టేదే యింపుగా నీకు

చ. 3: చెక్కుచేతిసిగ్గుతోడ సిరసు వంచినయాపె
        కక్కసపురతులు సంగతిగా నీకూ
        అక్కర శ్రీవెంకటేశ అలమేలుమంగ నని
        వొక్క టయితి విది మతి నుండెఁ గా నీకూ