పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-5 సాళంగం సంపుటం: 11-407

పల్లవి: చాలుఁ జాలు నంత మాతో సత్యా లేల
         పోలించి వింటేఁ గల్లలు పుట్టెఁడేసి రాలవా

చ. 1: యెగ్గు పట్టే వని నిన్ను యేమి యనఁ జాలఁ గాక
       సిగ్గుపడే వని నీపైఁ జే చాఁచఁ గాక
       నిగ్గుల నీతోఁ గనక నే నేపాటి నవ్వినాను
       బగ్గన నీయచారాలు బయిటనే పడవా

చ. 2: తల వంచే వని నిన్నుఁ దారుకాణఁ బెట్టఁ గాక
        కలఁగే వని పయ్యెదఁ గప్పితిఁ గాక
        వొలిసి నేఁ గనక నిన్నొత్తి మాట లాడితేను
        యెలమి నీదొరతన మిట్టే యేరుపడదా

చ. 3: పై పైఁ దమకించే వని పచ్చి సేయఁ జాలఁ గాక
       కోపగించే వని నిన్నుఁ గూడితిఁ గాక
       యేపున శ్రీవెంకటేశ యిట్టె నిన్ను నొరసితే
       తీపులనీమోవి తప్పు దీరుచుకోఁ బడదా