పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-4 సామంతం సంపుటం: 11-406

పల్లవి: చీ చీ సతుల మనఁగ సిగ్గు గాదా
         తాచి యిన్నియు నింకఁ దడవ నేమిటికి

చ. 1: సొలసియునుఁ దని వోదు చూచియునుఁ దని వోదు
       పలుమారు నీమీఁదఁ బాడి తని వోదు
       వలవ నేరుచు నాకె వలపించ నేర్చితివి
       చెలులబతుకులు యింకఁ జెప్ప నేమిటికి

చ. 2: కదిసియునుఁ దని వోదు కడు నవ్వి తని వోదు
       అదన నీతో మాట లాడి తని వోదు
       మది నిలిచె నీ కాపె మన్నించితివి నీవు
       గుదికొన్న కామినుల గొడవ యేమిటికి

చ. 3: మెచ్చియునుఁ దని వోదు మితిమీరి తని వోదు
        కొచ్చి కాఁగిటిరతుల గూడి తని వోదు
        యెచ్చటను శ్రీవెంకటేశ ననుఁ గూడితివి
        హెచ్చితి మిద్దర మొకటే యితరు లేమిటికి