పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-2 గౌళ సంపుటం: 11-404

పల్లవి: వాఁడివో నీ రమణుఁడు వలసినట్టు సేయనీ
         పేఁడుకొని మాకు నింత పెనఁగ నేమిటికి

చ. 1: బలిమిఁ బట్టఁగ రాదు పరాకున నుండ రాదు
       యెలమి నీతోడిపొందు లెటుఁ బో రాదు
       వలపు తీపన రాదు వడిఁ గార మన రాదు
       చెలులము సారె బుద్ది చెప్పకుండ రాదు

చ. 2: నవ్వులు నవ్వఁగ రాదు నాలి నూరకుండ రాదు
       యివ్వల నీతో సరస మెటుఁబో రాదు
       జవ్వన మిందుకో రాదు చాలించి పో దొబ్బ రాదు
       మవ్వపు మీతేఁకువలు మాకుఁ జూడ రాదు

చ. 3: తప్పక చూడఁగ రాదు తల వంచు కుండ రాదు
       యెప్పుడు నీతోడిజాడ యెందుఁ బో రాదు
       అప్పఁడు శ్రీవెంకటేశుఁ డలయేలుమంగ నిన్ను
       యిప్పుడిట్టె కూడె మాకు నేమీ నన రాదు