పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-1 పాడి సంపుటం: 11-403

పల్లవి: ఇంతులచేఁ జెప్పి పంపె యిదివో యాతఁడు దానె
         సంతసపు మేలుసుద్ది చాటరే యిందరికి

చ. 1: అంగనవద్దికి నేఁడు ఆతఁడే విచ్చేసీ నట
       సింగారింతము రారే చెలులాల
       ముంగిల ముగ్గులు వెట్టి ముత్తేల పందిలికింద
       బంగారుపీఁట వెట్టి పరవు వరచరే

చ. 2: యిందుముఖి మన్నించ నిప్పుడిది వేళ యట
       విం దాయిత్తము సేయరే వెలఁదులాల
       గందముఁ గస్తూరియును కప్పురవిడెములును
       అందుకఁ బన్నీటఁ బాదా లదె కడుగరే

చ. 3: వాయిదాలు వాయించేరు వాకిటికి రాఁ బోలు
       యీయింతిఁ జేపట్టినాఁ డింతలో నట
       యీ యెడ శ్రీవెంకటేశుఁ డీమగువతోఁ గూడె
       చే యెత్తే మొక్కరే మీరు సేసినట్టి మేలుకు