పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-6 రీతిగౌళ సంపుటం: 11-402

పల్లవి: గుబ్బతిల్లె తమలోని గుద్దిరా లింతే కాక
         గొబ్బున నీడకు వచ్చి కొంగు వట్టఁ గలదా

చ. 1: ఆతఁడే నాయింట నున్నాఁ డందరు సతులుఁ గూడి
       యేతులకుఁ గోపగించి యేమి సేసేరే
       చూతమువో వొక్క తైనా సోరిదిఁ గాంతునిఁ దమ
       చేతికి లోనుగాఁ జేసి చిక్కించుకోఁ గలదా

చ. 2: చనవు నా కిచ్చినాఁడు సవతు లెందరు గల్లా
       యెనయక నామీఁద నేమి సేసెరే
       ననుపున నొక తైనా నన్నుఁ గూడినట్టిపతిఁ
       బెనఁగి వేరె వలపించుకొనఁ గలదా

చ. 3: బాసతోడ నన్నుఁ గూడెఁ బైకొని శ్రీవెంకటేశుఁ
       డీసులవా రిందరును యేమి సేసేరే
       ఆస లింతే కాక వచ్చి అందులో నొకతె యైనా
       నాసరి నుండి పతితో నవ్వి చూడఁ గలదా