పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0366-1 భూపాలం సంపుటం: 11-391

పల్లవి: నిన్నటికి నాయఁ బోయ నేఁడే లయ్య
         కన్నుల బీరాలే కాని కాంక్ష లేకుండ దయ్యా

చ. 1: వొట్టు వెట్టుకొనెఁ గాన వూర కున్నది చెలియ
       వెట్టికి మాట లాడక వేఁడుకోవయ్య
       పట్టినపంతమే కాని పై నున్నది ప్రేమ
       వట్టియనువనా లేల వద్దికి రావయ్యా

చ. 2: పలుక దింతే కాని భార మెల్ల నీ మీఁదనే
       చలి వాయఁ బై చేయి చాఁచవయ్య
       చల మనేపేరు గాని సతి తమకము బెట్టు
       కలికిచెక్కులు నొక్కి కాఁగిలించవయ్యా

చ. 3: సిగ్గులే మరఁగు గాని చింతలు వెలి కురికీ
       యెగ్గు దీర మంచముపై కేఁగవయ్య
       అగ్గమై శ్రీవెంకటేశ అంగనఁ గూడితి వింక
       నిగ్గుల నాపెకోరికె నెరవేర్చవయ్యా