పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0365-4 భవుళి సంపుటం: 11-388

పల్లవి: ఏల చిన్నఁ బోయినాఁడ విందుకుఁ గాను
         ఆలరి వినోద మింతే ఆపె నీపైఁ గోపమా

చ. 2: కలికికన్నుఁ గొనల కాంత నిన్ను నవ్వఁగాను
       తల వంచే వేమయ్య తక్కక నీవు
       అలిగినవిధమో నీ వవ్వల యే మైనఁ జేసి
       చెలరేఁగి యిందు వచ్చి సిగ్గు వడ్డ విధమో

చ. 2: సోవలు గా నూరివారి సుద్దు లాపె చెప్పితేను
       యీవలఁ బైకిఁ దీసుకో నే లయ్య నీకు
       తావుల నీ కందే మైనా తగులు గలదో కాక
       కావిరి నెం దైన మరి కలఁగి వచ్చితివో

చ. 3: గక్కన నాపె నిన్నుఁ గాఁగిటఁ గూడఁగాను
       వొక్కటై శ్రీవెంకటేశ వుస్సు రనేవు
       అక్కడ నెవ్వతె కైన ఆస యిచ్చి వచ్చితివో
       లక్కవలెఁ గరఁగినలాగు రతిఁ జూపేవో