పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-2 రామక్రియ సంపుటం: 11-380

పల్లవి: ఏఁటికి వాదుకు వచ్చే వింత నీవు
         నాటకపుటాన లేల నమ్మనా నేను

చ. 1: చెంతలఁ జెప్పనమాఁట చెవి యొగ్గి వింటిఁ గాక
       కాంతుఁడ నీచేఁత లెల్లాఁ గంటినా నేను
      యింతలోనేఎ నీకుఁ గోప మేల వచ్చె నిందరిలో
      నంత నిన్ను గురి సేసి అంటినా నేను

చ. 2: చెక్కుల తమ్మచెదరు చేతఁ దుడిచితిఁ గాక
       తక్కిన వెఱుఁగుదునా తప్పులు నేను
       గక్కన నీ వేల తారుకాణలకుఁ బెట్టేవు
       వొక్క టై నీవద్దఁ బాయ కుండితినా నేను

చ. 3: మించి కాఁగిలించఁగా నీ మేను నిమిరితిఁ గాక
        యెంచి నీ మైగురుతు సోదించేనా నేను
        అంచల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
        యించు కంతయిన నలయించేనా నేను