పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0363-4 వసంతవరాళి సంపుటం: 11-376

పల్లవి: ఆన లేన పెట్టుకొనే వప్పటి నాతో
         దాని కేమి దోసమా తగినంతే కాక

చ. 1: చెలచేఁ బిలిపించఁగ చేర వచ్చితిని గాక
       వలచి నీ యంత నీవే వచ్చితివా
       వెల లేక మోహించి విడువ లేనేఁ గాక
       కల నీగుణమే తొల్లి కన్నది గాదా

చ. 2: సేవలు నేఁ జేయఁగాను చిత్తము గరఁగెఁ గాక
       కావించి నీ యంత నీవే కరఁగితివా
       యీవల గూళ నై నేనె యిట్టె పై కొందుఁ గాక
       చేవ గలంతే కాక సేసి పెట్ట వచ్చునా

చ. 3: దండ నేనే వుండఁగాను దయ దలఁచితి గాక
       గుండె గరఁగి నీ యంతఁ గూడితివా
       నిండి శ్రీవెంకటేశ నీకు నాకుఁ బోదు గాక
       వెండియు నీతో విన్నవించ గురి యున్నదా