పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0362-6 సాళంగం సంపుటం: 11-372

పల్లవి: సడి సన్న యట్టి నెరజాణ నందువు
         గొడవలు దీరఁ జెలి గూడ రాదా రతుల

చ. 1: చిగురుఁబానుపుమీఁదఁ జెలి విరహనఁ బొంది
       చిగురువంటిచేయి చెక్కునఁ బెట్టి
       చిగురులోపలిచేగ చిత్తమునఁ బుట్ట దాయ
       చిగురుఁబోణిని దయ్య నేయ రాదా విభుఁడ

చ. 2: పూవులతోఁటలోన పొలఁతి తాపాన నుండి
       పూవుల మొగ్గుల మేనఁ బులకించెను
       పూవులలో పూఁపలు పుట్ట వాయ మాటలలో
       పూవుఁబోణి నీవు గొంత బుజ్జగించ రాదా

చ. 3: పండువెన్నెలబయట భామిని యలయుచునుండి
       పండువంటిమోవివాఁడు బయల వేసె
       పండుగలు గాఁగ నిట్టె బాపురె శ్రీవెంకటేశ
       పండుజవ్వనిఁ గూడితి పవ్వళించ రాదా