పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0362-4 కన్నడగౌళ సంపుటం: 11-370

పల్లవి: నీ మన సెట్టుండునో నేనెరఁగను
         కోమలపుఁ బలుకులఁ గొసరే నే నిదివో

చ. 1: తప్పక చూడగ నోప తల వంచుకొన నోప
       చిప్పిలుఁ జెమటతోడి సిగ్గలే కాని
       ముప్పిరి ములుగ నోప ముందటనే నగ నోప
       అప్పటప్పటికి నుస్సు రనుటే కాని

చ. 2: యేమీ నడుగనోప యెవ్వరిఁ గోపించ నోప
       ఆమని జాగరముల అలపే కాని
       నేమపువ్రతాల కోప నిండుమాయలకు నోప
       చే మంచి తమకలము చింతించుటే కాని

చ. 3: బుద్దులు చెప్పఁగ నోప బూములు దొక్కఁగ నోప
       వొద్దనె పాయక నీతో నుండుటే కాని
       గద్దరి శ్రీవెంకటేశ కలసితి విదె నన్ను
       వద్దని తోయఁగ నోప వంచుటే కాని