పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0362-3 సాళంగనాట సంపుటం: 11-369

పల్లవి: సందడికిఁ జొర నేల చలము సాధించ నేల
         అం దెంది సరసమాడి అండ నుంట గాక

చ. 1: పంతపు నీ మాటల బావించి తెలియఁ బోతే
       కొంతము లై నాటుఁ గాక కొర తయ్యీనా
       చింత లేల మాకును నీ చేఁతలే చూచుకొంటా
       అంత కంతే చాలు ననే దది మేలుగాక

చ. 2: నగెటి నీ నవ్వుల నయాన వహించుకొంటే
       వొగరులే మించుఁ గాక వుడి వోయినా
       తల వేల నీమంచితనానకే మెచ్చుకుంటా
       మొగమొగా లెదుటనే మొక్కు కొంటఁ గాక

చ. 3: కాఁగిటి నీరతులు గాలించి వెదకఁ బోతే
       మాఁగినచవులే కాక మానఁ బోయీనా
       సాఁగిన శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడితివి
       పొఁగు వోఁగుఁ బొందినట్టు పురిగొంట గాక