పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0362-1 శంకరాభరణం సంపుటం: 11-367

పల్లవి: నేనె కూళఁ గాని వాడు నెరజాణఁడే
         తానె నావెంటవెంటఁ దగిలీనె వీఁడు

చ. 1: మన్ననలు నాకు నిచ్చిన మరి నే నెంత దూరిన
       కన్నులనె నవ్వు నవ్వీఁ గదవే వీఁడు
       సన్న లెరఁగక నేనె సారెఁ దమకింతుఁ గాని
       పన్ని నే నెం తలిగినఁ బదరఁడే వీఁడు

చ. 2: యిచ్చకము నాకుఁ జేసి యెంత నే నలిగినాను
       బచ్చనల నావద్దఁ బాయఁడే వీఁడు
       కుచ్చతాన నేనె తన్నుఁ గొంగు వట్ట నియ్యఁ గాని
       విచ్చనవడిఁ దా నైతే వేఁడుకొనీనె వీఁడు

చ. 3: తాలిమితోడను నేఁ దల వంచుకుండినాను
       కేలు చాఁచి నన్ను బుజ్జగించీనె వీఁడు
       వే ళెరిఁగి రతుల శ్రీవెంకటేశుఁడిట్టె కూడె
       నాలి దీర నన్నిట్టె నమ్మించెనే వీఁడు