పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-6 నాగవరాళి సంపుటం: 11-366

పల్లవి: ఎఱఁగ నైతి నిందాఁక యింత నీవు జోలిఁ బెట్టే
         దెఱఁగుకో నిన్నుఁ గొల్చే దిందుకొరకా

చ. 1: మాయదారిమాటలే మాపుదాఁకా నాడి నా
        కాయముపై నొరగితే కాఁక మానీనా
        ఆయములు సళుపఁగ నాసపడి నీరాక
        కీయెడ నేఁ గాచుకున్న దొందుకొరకా

చ. 2: నాటకపునవ్వులే నవ్వి నాతో వేగించఁగ
       తాఁటలు దూఁటలే కాక తాపము మారీనా
       కూటమి గలిగె నంటా కోరన సంతోషముతో
       యీటున నుండిన దెల్లా నిందుకొరకా

చ. 3: పెనఁగి వట్టికాఁగిట బిగియించి సారె నా
       తనువు నిమిరితేనె తని వయ్యీనా
       ఘనుఁడ శ్రీవెంకటేశ గక్కునఁ గూడితి విట్టె
       యెన లేని నీ మతకా లిందుకొరకా